సహజ సంపదలు! భూమాత కడగండ్లు!!

ప్రకృతే నియంత్రిస్తుంది! 14 ప్రకృతే శాసిస్తుంది!!



చిట్టచివరి కొమ్మను తెగనరికాం! చివరికి మిగిలిన చిరు చేప పిల్లను మింగేసాం! ఆఖరి నీటిబొట్టును గుటకాయ స్వాహ చేసాం! భూ దొంతరనిలను తవ్వేసాం! సముద్ర గర్భాన్ని మధించి బడభాగ్ని సృష్టించాం! ఆకాశానికి హద్దులు లేవంటూ గ్రహాంతరాలను కుమ్మేస్తున్నాం! అయినా మనిషి మారలేదు. కోరికలు ఇంకా తీరలేదు. అన్వేషణ సాగుతూనేవుంది. ఇదంతా ఓ అభివృద్ధిగా, మానవ మస్తిష్కంలో మెదిలే ఆలోచనకు పరా కాష్టగా వీటిని అభివర్ణిస్తూనే వున్నాం!
మానవుడు ఓ మహనీయుడని, శక్తిపరుడని, యుక్తిపరుడని అభివర్ణించు కుంటూనే తన శక్తియుక్తుల్ని విధ్వంసక చర్యలకు వినియోగించు కుంటున్నాడు. వీటి ఫలితాన్ని, అభివృద్ధి నమూనాల్ని రేపటి భావితరం ఎదుర్కోవాల్సి వస్తుందనే ఇంగిత జ్ఞానం కొరవడి, నేటి తన సుఖలాలస జీవనంకై భూ, ప్రకృతి వ్యతిరేక ఆవిష్కరణల్ని ఉన్నత వర్గాలకై, గృహ, వ్యక్తిగత వినియోగంకై అవసరానికి మించిన వస్తువు వినియోగాన్ని పెంచుకుంటున్నాడు. ప్రజల్ని వినియోగ దారులుగా మార్చి వేస్తున్నాడు. మానవుడి పుట్టుకే సుఖపడ డానికని, ఎన్నో జన్మల పుణ్యఫలమే మనిషి జన్మని, సుఖపడితే తప్పు లేదని బోధనల్ని చేస్తున్నాడు. ఇలాంటి జీవితాన్ని గడపడానికై అడ్డగోలుగా, అక్రమంగా సంపదల్ని పోగు చేసుకుంటున్నాడు. ఇవి వికృత రూపం దాల్చి యావత్‍ భూమండలాన్ని, నింగి నేల, సముద్రం అనే తేడా లేకుండా విషమయం చేస్తున్నాడు. మొత్తం భూగోళానికి తానే కర్తనని విర్రవీగుతున్నాడు.


భూగోళంపై ఏం జరుగుతోంది…??
దాదాపు 18వ శతాబ్దాపు మధ్యభాగం దాకా భూగోళానికి మానవుడు తలపెట్టిన విధ్వంసం దాదాపుగా లేదనే చెప్పాలి. నాగరికత సంతరించుకుంటున్న నేపథ్యంలో మానవుడి మేధస్సు రాతియుగానికి, కొంతమేర లోహయుగానికే అనుబంధంగా వుండేది. మట్టిలో పుట్టిన మనిషి, మట్టితో అనుబంధంగానే జీవించాడు. దాదాపు క్రీ.శ. 1760 దాకా ప్రకృతిలో భాగంగా జీవించిన మనిషి, తన మేధస్సుకు పదను పెట్టడం ప్రారంభించడంతో చిన్న చిన్న పరికరాల్ని రూపొందించి, ఆయా పనుల్ని సులభంగా చేసుకోవడం మొదలుపెట్టాడు. వీటి తయారికి యాంత్రిక శక్తిని జోడిస్తే వస్తు ఉత్పత్తి పెరుగుతుందనే ఆలోచన ఆవిరియంత్రం ఆవిష్కరణకు దారితీసింది. అప్ఫటికే మానవ, జంతు శ్రమతో వినియోగించబడుతున్న చక్రం ఆవిరి యంత్రానికి జతకావడంతో మానవుడి జీవనవిధానాన్నే కాదు, యావత్‍ ప్రపంచాన్ని శీఘ్రగతిన మార్చివేసింది. అలా ఆవిరియంత్రంతో మొదట బ్రిటన్‍లో మొదలైన పారిశ్రామిక విప్లవం, స్వల్ప కాలంలోనే యూరప్‍, అమెరికా ఖండాలలో విజ్ఞాన శాస్త్రంతో అనుసంధానించబడి మరింత ఆధునీ కరణకు గురైంది. దీంతో వస్తువుల ఉత్పత్తి అధికమైంది. వీటికై పెట్టుబడి అనే భూతం తోడుకావడంతో ప్రపంచ స్థితినే మార్చివేసంది.


ఇప్పటి ఆధునిక డిజిటల్‍ విప్లవంతో కలిపి ఈ పారిశ్రామిక విప్లవాన్ని నాలుగు విప్లవాలుగా అభివర్ణిస్తారు.

అవి:

1.ఆవిరియంత్రం ఆవిష్కరణ (innovation of steam engine)
2.విజ్ఞాన శాస్త్ర యుగం (the age of science)
3.అనూహ్యంగా పెరిగిన వస్తు ఉత్పత్తి (mass production of goods)
4.నూతనశక డిజిటల్‍ టెక్నాలజీ (emerging digital technology)


ఈ జ్ఞాన సముపార్జన మూలాలు క్రీస్తుకు పూర్వమే మొదలైనట్లు అనేక చారిత్రక ఆధారాలు అందుబాటులో వున్నాయి. వరుసగా అవి:


1.ప్రాథమిక స్థాయి పనిముట్లు (tools) ఉత్పత్తి – క్రీ.పూ. 40-10 వేల సం।। పూర్వం.
2.లోహ సంగ్రహణ (metallurgy) – క్రీ.పూ. 3600 సం।। క్రితం నుంచి
3.ఆవిరిశక్తి వినియోగం (steam power) – క్రీ.శ. 1764-1840 సం।। నుంచి
4.యంత్రాలతో వస్తు ఉత్పత్తి (mechanised goods production) – క్రీ.శ. 1908 నుంచి
5.భారీ యంత్రాలు / వాహనాలు / రైలు ఇంజన్లు (heavy machines)- క్రీ.శ. 1946 నుంచి


ఖనిజ సంపద – భూ విపత్తు:

ఆస్తులు ఓ ప్రాణాంతకం అన్న సామెతలా, భూగర్భ, భూతల ఖనిజ, జల వనరులు నేడు భూగోళ ఉనికికే ప్రాణసంకటంగా మారాయి. జీవరాశి మనుగడకు కారణమైన ఈ మూలకాలు చివరికి మానవునితో సహా జీవుల అంతానికి కూడా కారణభూతమైతున్నాయి. నాగరికతకు, మానవ వికాసానికి దోహదం చేసిన, ఈ మూల ఖనిజ సంపద చివరికి మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారాయి.
ఆదిమానవుడి రాతి పనిముట్లతో మొదలైన సృజనాత్మకత రాకెట్‍తో గగనతలాన్ని శోధించే దాకా ఎదిగిపోయింది. ఈ క్రమాను గతతోనే ఇనుమును గుర్తించడం, ఇతర లోహాల్ని సంగ్రహించడం, వీటితో వివిధ రకాల పరికరాలను, యంత్రాల్ని తయారు చేసు కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. వీటి తయారికై ఇంధనం కావాల్సి రాగా, మొదట కర్రను ఉపయోగించి, ఉష్ణాన్ని జనింప చేసేవారు. ఈ విధానం అడవులపై తీవ్ర ప్రభావం చూపడంతో, భూగర్భ ఇంధనాలైన నేల బొగ్గును (1679), పెట్రోలియంను (1875) వినియోగంలోకి తెచ్చారు. ఇంతకు ముందే అరేబియన్‍ దేశాల్లో సహజవాయువు (క్రీ.పూ. 6000-2000) గాలిలో మండడాన్ని గుర్తించారు. ఇది భూమిలో, సముద్ర గర్భంలో విస్తారంగా లభిస్తుందని, దీంతో కావల్సినంతగా ఉష్ణశక్తిని జనింప చేయవచ్చునని భావించి, 1626 సం।। నుంచే దీని ఉనికికై అన్వేషణ ప్రారంభమైంది.


నిప్పుకు గాలి తోడైనట్లు ఖనిజ సంపదకు పారిశ్రామీకరణ తోడై ప్రపంచ ముఖచిత్రాన్నే మార్చివేసింది. భారీ యంత్రాలు భూ, సముద్ర గర్భాల్ని తొలిచి సహజ సంపదను వెలికితీసి వినియోగించ డంతో, వెలువడే విసర్జకాలు, వాయు కాలుష్యాలు భూభాగాల్ని, సముద్రాల్ని కలుషితం చేయగా, వాయు కాలుష్యము వాతావరణాన్ని విషతుల్యం చేస్తున్నాయి. ఒకప్పుడు యుద్ధాల్ని చేసి ఆయా దేశాల్ని ఆక్రమించుకునే విధానానికి భిన్నంగా, నేడు ఈ ఖనిజ సంపదపై గుత్తాధిపత్యంకై అగ్రరాజ్యాలు పోటీ పడుతూ, అనేక దేశాలమధ్య యుద్దోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, ఆయుధాలను ఇరు దేశాలకు అమ్ము కుంటూ, పెద్ద పెట్టుబడి దేశాలుగా చలామణి అవుతున్నాయి. వీటి దాష్టికాల్ని వ్యతిరేకించి, ఎదురొడ్డి నిలబడిన ఆయా దేశాధినేతలని కొందరిని చంపగా, (సద్దాం హుస్సేన్‍, కల్నల్‍ గఢాఫీ), మరికొందరిపై (ఫిడెల్‍ కాస్ట్రో, చావెజ్‍) పదులసార్లు హత్యాప్రయత్నం చేసారు.


ప్రకృతి సంపద చేతిలో వుంటే, ప్రపంచాన్ని ఆడించవచ్చని భావించిన అమెరికాలాంటి దేశాలు, అనేక దేశాల్లో కీలుబొమ్మ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసి నిరాటంకంగా దోపిడిని సాగిస్తున్నాయి. వీటి కనుసన్నల్లో నడిచే ఐక్యరాజ్యసమితి (UN), ప్రపంచబ్యాంక్‍ (WB), యునెస్కోలు (UNESCO) యావత్‍ ప్రపంచాన్ని ఓ కుగ్రామంగా మార్చడానికై గాట్‍ (GATT-1947) ఒప్పందం పేరిట డంకెల్‍ డ్రాఫ్ట్ డంకెల్‍ (1991)ను తయారుచేసి అన్ని దేశాల్లో సరళీకరణకు (Liberalisation), ప్రైవేటీకరణకు (Privatisation), ప్రపంచీకరణకు (Globalisation) దారుల్ని వేసాయి. ఇందుకోసం అన్ని దేశాలతో (భారత్‍తోసహా) ఈ ఒప్పందాలపై సంతకాలు చేయించాయి. వీటి ఫలితాలే ప్రపంచ వ్యాపితంగా వనరులు, ఖనిజ సంపద దోపిడి. ఈ దోపిడికి మూలస్తంభాలు ప్రపంచస్థాయి సిఇవో(CEO) లు కాగా, వీరంతా ప్రతీ జనవరిలో స్విడ్జర్‍లాండ్‍లోని దావోస్‍లో సమావేశమై దోపిడి విధానాలకై వ్యూహరచన చేస్తూ వుంటారు. మనదేశం నుంచి కూడా ముఖేశ్‍ అంబానీతోపాటు ఇతర గుత్త పెట్టుబడుదారులు హాజరైతారు.
ఇలా తవ్విన ఖనిజసంపద తరలించుకపోవడం, లేదా అనుకూల ప్రాంతాల్లో భారీ పరిశ్రమల్ని పెట్టి శుద్ధి చేసి, సంబంధిత వస్తువుల్ని తయారు చేయడం ఓ ప్రపంచ వ్యాపారంగా మారింది.


ప్రపంచ వ్యాపితంగా అత్యధికంగా తవ్వబడుతున్న ప్రధాన ఖనిజాలు.
1. నేలబొగ్గు:
లక్షలాది సంవత్సరాల క్రితం భూకంపాల ద్వారా, ఇతర విధ్వంసాల ద్వారా భూస్థాపితమైన అటవి సంపద కార్బొనీకరణ (Corbonization) చెంది నేలబొగ్గుగా రూపాంతరం చెందుతుంది. ఈ నేలబొగ్గు నేటి పారిశ్రామీకరణకు ప్రధాన ఇంధనంగా వాడడంతో ప్రపంచ వ్యాపితంగా టన్నులకొద్ది తవ్వితీస్తున్నారు. ఇలా తవ్విన
ఉపరితల, భూగర్భ ప్రాంతాల ప్రజల, ఇతర జీవరాశులకు ప్రాణాం తకంగా మారడమే కాక అనేక ఆరోగ్య సమస్యలకు హేతువైతున్నాయి. దీన్ని ఇంధనంగా వాడడంతో జనించే కార్బన్‍ డయాక్సైడ్‍ వాతావరణాన్ని కాలుష్యం చేయడమేకాక, భూగోళాన్ని వేడెక్కిస్తున్నది.

2.ఇనుప ఖనిజము (హేమటైట్‍):
పారిశ్రామిక విప్లవానికి వెన్నుదన్నుగా నిలిచి, పరిశ్రమలకు, యంత్రాలకు, వాహనాలకు, గృహనిర్మాణాలకు ప్రధాన ఇరుసుగా మారిన ఇనుప ఖనిజం నేలబొగ్గు తర్వాత అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతున్న ఖనిజం. ఇది హేమటైట్‍, మాగ్నటైట్‍, లిమోనైట్‍ లాంటి ఖనిజాల నుంచి తయారు చేస్తారు.

3.అల్యూమినియం (బాక్సైట్‍):
అల్యూమినియం ముడిపదార్థమైన బాక్సైట్‍ ప్రపంచ వ్యాపితంగా తవ్వితీస్తున్న మూడవ అతిపెద్ద ఖనిజం. అల్యూమినియం తేలికగా, మన్నికగా వుండడమేకాక, తేమను తట్టుకునే గుణం వుండడంతో ఈ లోహాన్ని విమానాల తయారికి వాడుతారు. అందుకే దీన్ని తెల్లబంగారం అని అంటారు.

4.పాస్పేట్‍ రాయి:
రసాయనిక ఎరువుల తయారికి, జంతువుల దానకై ఉపయోగించే ఈ ఖనిజం మిగులునుంచి భాస్వరం (P) తయారైతుంది. ఈ భాస్వరాన్ని పేలుడుకు ఉపయోగిస్తారు. ఖనిజ తవ్వకాల్లో ఇది నాల్గవ స్థానం ఆక్రమించింది.

5.జిప్సం (Gypsum) CaSO4-2H2O :
దీని రసాయనిక సూత్రం ప్రకారం ఇందులో సున్నం, గంధకం కొంతమేర నీటితో ( CaSO4-2H2O ) కలిసివుంటుంది. దీని వడపోతను బట్టి విభిన్న రకాలుగా ఉపయోగపడుతుంది. సున్నం నేరుగా సిమెంట్‍ తయారిలో వాడగా, గంధకం మందుల తయారిలో, ఎరువుల తయారిలో, పేలుడు పదార్థాలలో దీన్ని విరివిరిగా వాడుతారు. ఇది ప్రపంచ వ్యాపితంగా తవ్వబడుతున్న అయిదవ ప్రధాన ఖనిజం.

6.పెట్రోలియం:
ఇంధనంగా వాడే పెట్రోల్‍, డీసెల్‍, కిరోసిన్‍లు పెట్రోలియం నుంచి వడకట్టబడగా, మిగతా మడ్డినుంచి వాక్స్ (మైనం), తార్‍(tar) లాంటి పదార్థాలు తయారు చేస్తారు. దేని ఉపయోగం దానిదే! నేలబొగ్గును మండించడానికి కొలుములు (furnnce) అవసరం కాగా, పెట్రోలియం ఇంధనాల్ని మండించడానికి సురక్షితమైన యంత్రం కావాలే! దీని ద్వారా ఉత్పత్తి అయ్యే ఉష్ణశక్తేకాక, ఉష్ణశక్తిని యాంత్రిక శక్తిగా, కాంతి శక్తిగా మార్చడం జరుగుతుంది. పెట్రోలియం నుంచి రసాయనాలను కూడా తయారు చేస్తారు. రంగులు, పేంట్స్ వీటి ఉత్పత్తులే!
సముద్రగర్భ, ఉపరితలంపైన వుండే ప్లాంక్‍టన్‍ అనే సూక్ష్మ జీవులు కార్బోనైజేషన్‍ చెందడంతో పెట్రోలియంగా తయారైతుంది. ఇవన్నీ ఓ సహజ పక్రియలు. అలాని పెట్రోలియం పునరుద్దరించబడే (recycle) ఇంధనం కాదు. ఈ పక్రియకు వేలాది సంవత్సరాలు పడుతుంది.

7.సహజ వాయువు (Natural gas):
సహజవాయువు కూడా దాదాపు పెట్రోలియం పక్రియలాగే ఏర్పడుతుంది. పోతే జీవులు (వృక్ష/జంతు) జీవించిన కాలంలో సూర్యుని నుంచి పొందిన శక్తిని రసాయనిక బంధాలతో దాచుకుంటాయి. ఇవి సజీవంగా భూస్థాపిత మైనప్పుడు, ఈ రసాయనిక బంధనాలు (chemical bonds) వాయువు స్థితిని పొంది భూపొరల్లో, సముద్రగర్భంలో నిక్షిప్తంగా వుంటాయి. అధిక పీడనం పెరిగినప్పుడు ఈ సహజ వాయువు పొరలని చీల్చుకొని బయటపడి వాతావరణంలోని ఆక్సిజన్‍తో చర్యనొంది మండుతుంది. దీన్ని నియంత్రించి లిక్విఫైయిడ్‍ పెట్రోలియం గ్యాస్‍గా (LPG), కంప్రెస్‍డ్‍ నాచురల్‍ గ్యాస్‍గా (CNG) గృహ, వాహన, యంత్ర వినియోగానికి వాడుతారు.
అలాగే భూపొరల్లో దీని గుర్తించి తవ్వి సరఫరా చేస్తారు. సముద్ర గర్భంలో దీనితో జనించే అత్యధిక వేడిని బడబాగ్ని (inextinguishable flame) అంటారు.
పైన ప్రస్తావించిన ప్రధాన ఏడు ఖనిజ, సహజ సంపదలలో నేలబొగ్గు, పెట్రోలియం, సహజవాయువు ప్రపంచ గతినే మార్చిన ప్రధాన ఇంధనాలు. ఇవి పునరుద్దరించబడని ఇంధనాలు. లేదా ఈ భూగోళం విధ్వంసమైతే, తిరిగి కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇవి తిరిగి రూపొందవచ్చు!
రేపటి అవసరాలనిగాని, భౌగోళిక క్షేమంగాని పట్టని నేటి పెట్టుబడి శక్తులు, ప్రపంచ వ్యాపితంగా కార్పోరెట్‍ శక్తులుగా ఎదిగి గుత్తాధిపత్యంతో వీటిని భూ సముద్ర గర్భాల నుంచి నిరంతరం తవ్వితీస్తున్నాయి. ఒకప్పుడు భూభాగాల, కనక, ధనరాసుల, మానవ వనరుల కొల్లగొట్టడానికి, ఆక్రమించడానికి, జరిగిన యుద్ధాలు, సామ్రాజ్య విస్తరణగా మారి, ఇప్పుడు సహజ వనరుల దోపిడికి, ప్రపంచాధిపత్యానికై యుద్ధాలు సాగిస్తున్నాయి. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, గల్ఫ్ యుద్ధాలు ఈ కోవలోనివే. ఉక్రేయన్‍, రష్యాయుద్ధం కూడా ఇందులో భాగమే! రామాయణ, మహాభారత్‍ యుద్ధాలుగాని, గ్రీక్‍ ఇతిహాసపు ట్రోజన్‍వార్‍ (Trojan war)) గాని ధర్మ యుద్ధాలు కావు.


ఒకప్పుడు రాజ్యం తన ఆధిపత్యం కోసం, సామ్రాజ్య విస్తరణ కోసం, నేడు పెట్టుబడులు పెట్టి దోపిడి చేయడం కోసం, వ్యాపార విస్తరణ కోసం దేనికైనా వెనుకాడదని చెప్పడానికే పైన కొన్ని సంఘటనలు ప్రస్తావించడం జరిగింది. కాలంతోపాటు విధానాలు మారినా, నాడు, నేడు అభివృద్ధి పేరున, మానవ వికాసం పేరున ధ్వంసరచన జరుగుతూనే వున్నది.
నియంత్రణ లేని ఖనిజ, సహజ సంపదల వెలికితీత భూమిని నిర్వీర్యం చేస్తున్నాయి. ఓ నిర్ధిష్ట ప్రామాణికతతో ఏర్పడిన భూమిని ప్రకృతి (ధరిత్రి) విరుద్దంగా, భౌగోళిక అస్తిత్వానికే మృత్యు ఘంటికల్ని మోగిస్తున్నారు. వాతావరణాన్ని నిప్పుల కొలిమిగా మారుస్తున్నారు. దీని దుష్ఫలితాల్ని నేటి ఆధునిక మానవుడు, జంతు జాలం, ప్రకృతి విభిన్న రూపాలలో (భూకంపాల/ఉప్పెనల/ సునామీల/ టొర్నాడోల/ నేడు కరోనాలాంటి మహ్మమారీల) అనుభవిస్తూనే వున్నది.


ధరిత్రినంతా శోధన చేస్తూ,
గుల్లబొడుస్తూ గాయం చేసినా
ఆకాశానికి నిచ్చెన లేస్తూ,
గ్రహాంతరాలపై పరుగు దీసినా
మనిషి మారలేడు.
వాడి తృష్ణ చావలేదు!!

(వచ్చే సంచికలో పృథ్వి దాతృత్వాన్ని చూద్దాం!)

  • డా।। లచ్చయ్య గాండ్ల,
    ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *