A Small body of determined spirits fired by an unquenchable faith in thair mission can alter the course of history.
-Mahathma Gandhi
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. ఉద్యమం పొడగునా కలలు- ‘తెలంగాణొస్తే మన వ్యవసాయరంగానికి, పల్లెలకు నిరంతర సరఫరా అందించవచ్చు, భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించుకొని గోదావరి, కృష్ణా నీళ్లను రాష్ట్రం నలుచెరుగులా పారించి పాడి పంటలతో పచ్చగా మెరిసిపోయే తెలంగాణను సాకారం చేసుకోవచ్చు. మన పరిశ్రమలకు అంతరాయాల్లేని నాణ్యమైన, నిరంతర విద్యుత్తును అందించి తెలంగాణను పరిశ్రమల పెట్టుబడులకు చిరునామాగా రూపొందించవచ్చు.
ఉద్యమ తెలంగాణ కన్న కలలన్నీ నిజం కావాలంటే ముందుగా కావల్సింది, అవసరమైంది అత్యంత కీలకమైంది విద్యుత్తు. ‘తెలంగాణొస్తే ఏమొస్తుంది? తగినంత కరెంటు లేక చీకట్లో మగ్గిపోతుంది’ అని సాక్షాత్తు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ర తిప్పుతూ చెప్పిన మాటలు ఏ తెలంగాణవాది మరిచి పోగలడు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్తురంగ పునర్నిర్మాణం ఏ దశ నుంచి మొదలైందో అర్థం కావడానికి ఆ నాటి ఈ సంఘటన గుర్తు చేసుకుంటే చాలు.
తెలంగాణ ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ సాకారం కావాలంటే ముందుగా దృష్టిపెట్టి అభివృద్ధి చేయవలసింది విద్యుత్తురంగమే అన్న అవగాహన ఉన్న దార్శనికుడు,
ఉద్యమనాయకునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం. అందుకే విద్యుత్తురంగ అభివృద్ధికి తొలి ప్రాధాన్యాన్ని ఇచ్చి విస్తృత మేధోమథనం జరిపారు. ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, రంగాలకు వేలాది కోట్ల రూపాయల నిధులను వెచ్చించి అప్పటికే అందుబాటులో ఉన్న సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తే తప్ప నిరంతర విద్యుత్తు సాధ్యపడలేదు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా విద్యుత్తు రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్లనే వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్తు సాధ్యపడింది.
మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇప్పటికీ అక్కడి ప్రభుత్వాలు రైతులకు పగటిపూట ఏడు గంటల కరెంటు అందించడానికి ఆపసోపాలు పడుతున్నాయి. గుజరాత్‍లో చేపట్టిన ‘సూర్యోదయ కిసాన్ యోజన’ పథకం ఇప్పటికీ సాకారం కాలేదు. దేశంలోనే అత్యధిక జీడీపీ కలిగిన మహారాష్ట్రలోని రైతుల కష్టాలు అందరికీ తెలిసినవే. తరచూ రైతు ఆత్మహత్యలతో అల్లాడిపోతున్నది. దేశంలోని మరే రాష్ట్రం సాధించని అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు ఎలా సాధ్యపడిందో ఉత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలవారీగా కింద పేర్కొన్న ప్రగతి పట్టికను ఒకసారి విశ్లేషించుకుంటే అర్థమవుతుంది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వ్యవసాయరంగానికి విద్యుత్తు ప్రధాన చర్చనీయాంశమైంది. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఒకరు వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని, రైతులు 10 హెచ్‍పీ మోటర్లు వాడుకుంటే చిన్న చిన్న కమతాలుగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మూడు గంటల కరెంటు కంటే ఎక్కువ అవసరం ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు వ్యవసాయరంగానికి 6 గంటల కరెంటు రెండు, మూడు విడతలుగా ఇచ్చేవారు. దాని పరిణామాలు పంట నష్టాలు, రైతు ఆత్మహత్యలు, సబ్‍స్టేషన్ల ముందు ధర్నాలు, రాస్తారోకోలు, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు.. ఇవన్నీ పచ్చిగా కండ్లముందు కదలాడే మరిచిపోలేని ద•శ్యాలు, అనుభవాలు.
ప్రస్తుతం రాష్ట్రంలో 27 లక్షల 48 వేల వ్యవసాయ పంపుసెట్ల ద్వారా రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. రాష్ట్ర విద్యుత్తు వినియోగంలో సుమారు 31 శాతానికి పైగా వ్యవసాయరంగానికే పోతున్నది. రైతులకు ఉచితంగా కరెంటును అందించడం జరుగుతున్నది. 95 శాతానికి పైగా రైతులు 5 హెచ్‍పీ మోటర్లను వాడుతారు. ఎక్కడో ఒకచోట 7.5 హెచ్‍పీ మోటర్లు అతి తక్కువగా ఉపయోగిస్తారు. మనకున్న భూగర్భ జలాల లభ్యత రీత్యా 5 హెచ్‍పీ మోటర్లనే రైతులు వినియోగిస్తున్నారు. ఒక హెచ్‍పీ 745 వాట్లకు సమానం. అంటే 5 హెచ్‍పీ మోటర్ 3.725 కిలోవాట్లకు సమానమన్న మాట- ఈ లెక్కన రైతులు ఉపయోగిస్తున్న పంపు మోటర్ల సామర్థ్యం 11,000 మెగావాట్లు- అంటే గంటకు ఒక కోటి పది లక్షల యూనిట్ల విద్యుత్తు వినియోగం- గతంలో విడతల వారీగా వ్యవసాయరంగానికి ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే రైతులు పగలు తొమ్మిది గంటలు కరెంటు ఇవ్వడానికి అప్పటికే అందుబాటులో సబ్‍స్టేషన్లు లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవాల్సి వచ్చింది. అందుకుగాను సుమారు 30 వేల కోట్ల రూపాయలు వెచ్చించి అదనంగా 33/11 కేవీ సబ్‍స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల సామర్థ్యం పెంచుకోవడం, కొత్త 11 కేవీ ఫీడర్ల నిర్మాణం ఇత్యాది పనులను పెద్ద ఎత్తున చేయడం జరిగింది. చెప్పొచ్చేదేమంటే ఇప్పుడు ఉన్నపళంగా 5 హెచ్‍పీ మోటర్ల స్థానంలో 10 హెచ్‍పీ మోటర్లను బిగించవలసి వస్తే ఎలాంటి సాంకేతిక, ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయో చర్చించుకుందాం.
27 లక్షల 48 వేల వ్యవసాయ పంపుసెట్ల సామర్థ్యం 5 హెచ్‍పీతో లెక్కించినప్పుడు 11 వేల మెగావాట్లుగా ఉంటుంది. 10 హెచ్‍పీ మోటర్లుగా మార్చినట్లయితే 22 వేల మెగావాట్లు డిమాండు సరఫరా చేయాలి. ఇప్పటివరకు అన్నిరంగాలు కలిపి మన రాష్ట్ర పీక్ 15,497 మెగావాట్లుగా నమోదైంది. మరి 22 వేల మెగావాట్లు వ్యవసాయరంగ లోడ్ అయినప్పుడు ఆ మేరకు ఉత్పత్తి, పంపిణీ సరఫరా రంగాల సామర్థ్యాన్ని పెంచుకోవడం సాధ్యమయ్యే పనేనా? అందుకవసరమైన సుమారు 50 వేల కోట్ల భారీ నిధుల సేకరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందా? మార్కెట్లో 10 హెచ్‍పీ మోటర్ పంపు ఖరీదు సుమారు 70 వేలుగా ఉన్నది. 27 లక్షల 48 వేల పంపుసెట్లను మార్చడానికి అవసరమైన సుమారు రూ.18,900 కోట్లను ఎలా సమకూర్చుకుంటారు?
విద్యుత్తు ఉత్పత్తిని పెంచుకోవడం ఉన్నపలంగా సాధ్యం కాదు. ఏండ్ల తరబడి కొనసాగే పక్రియ ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తికి 6-7 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. 400 కేవీ, 220, 132 కేవీ, 33/11 కేవీ సబ్-స్టేషన్ల సామర్థ్యం రెట్టింపు చేసుకోవాల్సి ఉంటుంది. సబ్‍స్టేషన్ల నుంచి వచ్చే 11 కేవీ ఫీడర్ల సామర్థ్యం సరిపోదు కాబట్టి నూతనంగా ఇప్పుడున్న సంఖ్యకు ఇంచుమించు సమానస్థాయిలో నూతనంగా 11 కేవీ ఫీడర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవాలి. అంటే 100 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో మరొక 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ అయినా పెట్టాలి లేదా దానిస్థాయిలో 200 కేవీఏ ట్రాన్స్ఫార్మర్‍నైనా పెట్టాలి. వ్యవసాయరంగానికే సుమారు 4 లక్షలకు పైగా వివిధ కెపాసిటీలకు చెందిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లున్నాయి మన రాష్ట్రంలో. రైతులు కూడా స్టార్టర్లు, వైర్లు అన్నీ మార్చుకోవాల్సి ఉంటుంది. నిరంతర కరెంటు అందుబాటులో ఉండటం వల్ల రైతులకు లో ఓల్టేజీ సమస్య లేదు. అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు. అలా కాకుండా నిర్ణీత సమయంలోనే కరెంటు ఇచ్చినట్టయితే మోటర్లన్నీ ఒక్కసారే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే రైతులందరూ ఆటోమేటిక్ స్టార్టర్లు అమర్చుకుంటారు. దాని వల్ల గ్రిడ్‍పై ఒక్కసారిగా భారం పడుతుంది. మొదటిలాగే తరచుగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, వైర్లు తెగిపోవడం, ఫ్యూజులు ఎగిరిపోవడం లాంటి సమస్యలు షరామామూలే.
కేంద్రం తీసుకురానున్న విద్యుత్తు సవరణ బిల్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వద్ద పరిశీలనలో ఉన్నది. ఒక్కసారి చట్టం అమలుకు నోచుకున్నట్టయితే వ్యవసాయరంగం పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉన్నది. దేశంలోని 29 రాష్ట్రాల్లో దేశంలోని మరే రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్తు నిరంతరాయంగా 24 గంటలు అందించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం సాధించిన అద్భుత విజయాల్లో విద్యుత్తు రంగం ముఖ్యమైనదనే విషయం అంగీకరించాల్సిన చరిత్ర.
పారిశ్రామిక, వ్యవసాయ, సేవారంగాలనే కాకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ, మానవ జీవన ప్రవాహాన్ని కూడా ప్రభావితం చేస్తున్నది కరెంటు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అంశంగా ఉన్న విద్యుత్తు దేశ ప్రజల ప్రగతిని నిర్దేశిస్తున్నదనడంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం దేశం మొత్తమ్మీద ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల విద్యుత్తు వినియోగదారులకు 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2030-31 సంవత్సరానికి తెలంగాణ దక్షిణ భారతదేశంలోనే అత్యధిక విద్యుత్తు వినియోగం గావించే రాష్ట్రంగా అవతరించున్నదని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథార్టీ ఇటీవల పేర్కొనడం జరిగింది.
ఈ ప్రస్థానం ఆషామాషీగా జరగడంలేదు. దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, విద్యుత్తురంగంలో పనిచేస్తున్న వేలాది ఇంజనీర్ల, కార్మికుల కృషి ఉన్నది. తెలంగాణకు పూర్వం కరెంటు పరిస్థితి ఎట్లుండె, ప్రస్తుతం ఎట్లున్నది. ఎలా సాధ్యపడింది అన్న విషయాలను చర్చించుకుందాం. విజయాల సమీక్ష పునరావృతమైనప్పటికీ ఆనందాన్ని కలుగజేస్తుంది.
2014కు ముందు ఎంట్లుండె?
విద్యుత్తు వినియోగదారులను గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ, ప్రజావసరాల వర్గాలను విభజించుకుంటాము.
గృహం : గ్రామాలకు 12 గంటలు ఉదయం ఆరు నుండి సాయంత్రం 6 వరకు కోతలు. వేసవి కాలం రాత్రిపూట కోతలు అదనం. మండల కేంద్రాలు 8 నుంచి 12 గంటలు. జిల్లా కేంద్రాలు 4 నుండి 8 గంటలు. విశ్వనగరం హైద్రాబాద్‍కు 4 గంటల కోతలు. కరెంటు ఇచ్చే విషయంలో కూడా అమానవీయ విభజన. మనసు ఎంత పీకినా పిల్లాపాపలతో వేసవి సెలవుల్లో స్వగ్రామాలకు వెళ్లడానికి ఇష్టపడేవారు కాదు.
వాణిజ్యరంగం : ఏ నగరంలో చూసిన వాణిజ్య సముదాయాల ముందు జనరేట్ల రణగొణ ధ్వని. బజార్లో వెళ్తుంటే డీజిల్ వాసన సోకకుండా ముక్కుకు ‘దస్తి’ అడ్డం పెట్టుకునేవారు. అపార్ట్మెంట్లకు జనరేటర్ బ్యాకప్ ఉందా లేదా చూసుకునేవారు. జిరాక్స్, ఫోటోగ్రఫీ, ఐస్‍క్రీం, జ్యూస్ సెంటర్లు, హోటళ్లకు విద్యుత్తు కోతలతో అపార నష్టం సంభవించేది. క్రికెట్ మ్యాచ్‍లు లాంటివి ఉంటే ఇన్వర్టర్లు ఉన్న ఇళ్లు వెతుక్కునేవారము.
పారిశ్రామిక : రాష్ట్రంలోని పరిశ్రమలకు, ఐటీ హబ్‍లకు వారానికి రెండు రోజులు పవర్ హాలీడే. నెలకు 10 నుండి 12 రోజులు పారిశ్రామిక వాడల్లో చిమ్మ చీకట్లు. దీనికి అదనంగా ప్రతీ రోజు సాయంత్రం పీక్ అవర్స్ అంటే 6 గంటల నుండి 10 గంటల వరకు మూడు ఫేజులు కరెంటు వాడరాదు. లైటింగ్ మాత్రమే వాడుకోవాలనే నిబంధన. అతిక్రమించిన వారికి భారీ పెనాల్టీలు. విద్యుత్తు సిబ్బంది అనధికారికంగా ఏమైనా పరిశ్రమలకు కరెంటు ఇస్టున్నారా? అని తనిఖీలు చేయడానికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్లు తిరిగేవారు.
వ్యవసాయ రంగం : కరెంటు విషయంలో అత్యంత ఉపేక్షకు, నిరాదరణకు గురైన రంగం. రైతులను వినియోగ దారులుగా చూసేవారు కాదు. ఎక్కడ చూసినా వంగిన స్తంభాలు, వేలాడుతున్న తీగెలు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు వెరసి ఎండిన పంటలు. పవర్ హాలీడేల లాగ ‘‘క్రాప్ హాలిడే’’ ప్రకటించిన దుర్దినాలు. వ్యవసాయ సీజన్‍కు ముందు వ్యవసాయ శాఖ, కరెంటు డిపార్టుమెంటు వాళ్లు ఊరూరు తిరిగి వరి పంటలు వేయకూడదని ఆరుతడి పంటలు వేసుకోవాలని నీటి పారుదలకు సరిపోను కరెంటును సరఫరా చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని విన్నపాలు, బెదిరింపులు.
పగలు మూడు గంటలు, రాత్రి మూడు గంటల కరెంటుతో తరచుగా మోటార్లు కాలిపోవడం లేకుంటే ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం, కాలిన ట్రాన్స్ఫార్మర్‍ను మార్చేసరికి పానిపట్టు యుద్ధం గెలిచినంత ఆనందం.
3 హెచ్‍పీ మంజూరు ఉంది 5 హెచ్‍పీ మోటారు వాడుకుంటున్నందుకు డెవలప్‍మెంట్ చార్జీలు కట్టమని వేధింపులు, కరెంటు కత్తరింపులు. బిల్లులు కట్టడం లేదని స్టార్టర్లు, సర్వీసు వైర్లు పీక్కుపోవడం. లేకుంటే ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్లు బందు పెట్టడం. అన్నం పెట్టే రైతన్నకు అవమానాలు, అవహేళనలు.
ఇతర రంగాల విషయానికి వస్తే గ్రామాలలో నీటి సరఫరా బోరుమోటార్లు కాలిపోవడం, కరెంటు సరిపోక నీటికి కటకట తరచుగా మోటార్లు కాలిపోయి సర్పంచులు అప్పులు చేసి మరీ మోటార్లు రీ వైండింగ్ చేయించడం. మోటార్ టెస్టింగ్ చేయడానికి పదినిమిషాల మూడు ఫేజ్‍ల కరెంటు ఇవ్వడానికి కూడా భయపడిపోయే అధికారులు. పై నుండి వేధింపులస్థాయి అలాంటిది మరి.
నేటి పరిస్థితులు అందరికీ సానుకూల అనుభవాలు. భారతదేశంలోని మరే రాష్ట్రంలోనూ లేనంతటి మంచి కరెంటు. కోతలు లేవు, ఓల్టేజీ సమస్య లేదు. ప్రమాదాలు లేవు. ప్రజలు పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, రైతులు ఇలా సమస్త ప్రజానీకం కరెంటు సమస్య నుండి శాశ్వతంగా బయటకు రావడం జరిగింది.
మన రాష్ట్రంలోనే ఎందుకు సాధ్యపడింది. వేరే రాష్ట్రాలు ఎందుకు విఫలమవుతున్నాయి. ఉత్తరాది, దక్షిణాది, పశ్చిమాది ఏ రాష్ట్రంలో చూసినా కరెంటు కష్టాలు ఎందుకున్నాయి. ఢిల్లీ, బెంగళూర్, చెన్నై లాంటి కాస్మాపాలిటన్ నగరాలు కూడా కరెంటు కోతలతో తల్లడిల్లి పోవడమెందుకు.
2014 జూన్ 2నాడే రాష్ట్రం బాగుపడాలంటే విద్యుత్తు రంగాన్ని గాడిన పెట్టాలని కేసీఆర్ తిరుగులేని నిర్ణయం తీసుకున్నారు. స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘ కాలిక ప్రణాళికలను రూపొందించినారు. అన్ని రంగాల వారికి 20 గంటల కరెంటును అందించడంతో పాటు వ్యవసాయరంగానికి 9 గంటల పగటిపూట కరెంటు నివ్వాలనుకున్న కేసీఆర్ అనూహ్యంగా 24 గంటల సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయరంగానికి 24 గంటల కరెంటునిస్తే అధికార పక్షంలో చేరిపోతానని ప్రతిపక్షనాయకులు అనేంత అనితర సాధ్యమైన నిర్ణయమది. 2018, జనవరి 1 నుండి యావత్తు దేశం ఆశ్చర్యపడేలా రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా అందించడం ప్రారంభమైంది.
ఉచితాలకు వ్యతిరేకమని చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికే కాకుండా మిగతా ప్రజానీకానికి కూడా సబ్సిడీలు ఇవ్వరాదనే ఉద్దేశ్యంతో, డిస్ట్రిబ్యూషన్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడిదారులకు చోటు కల్పించి ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యపరచడానికి విద్యుత్తు సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, విద్యుత్తు సంస్థల ఉద్యోగులు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభ్యంతరాలు పార్లమెంటు సభ్యుల వత్తిడి మేరకు బిల్లును స్టాండింగు కమిటీకి నివేదించడం జరిగింది. బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మాణం కూడా చేసినారు.
ప్రజా వ్యతిరేకత దృష్ట్యా బిల్లు పెండింగులో ఉన్నప్పటికీ మార్గదర్శకాలు, సర్క్యులర్ల రూపంలో కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ వ్యవసాయ రంగానికి కూడా మీటర్లు పెట్టమని నిర్దేశిస్తున్నది. ఆదేశాలు పాటించని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం FRBN పరిమితిని పెంచకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆ రకంగా తెలంగాణ సుమారు 25 వేల కోట్ల రూపాయలు నిధులు కోల్పోవడం జరిగింది.
జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగాలకు వేలాది కోట్ల రూపాయల నిధులు కేటాయించి, స్వయం సమృద్ధిని సాధించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు 7,778 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంగా ఉండగా నేడది 19,464 మెగావాట్లకు చేరుకుంది. దామరచెర్లలోని యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంటు 4 వేల మెగావాట్లు, ఎన్టీపీసీ రామగుండంలో 1600 మెగావాట్లు, తొందర్లో అందుబాటులోకి రానున్నాయి. నిర్మాణంలో ప్రాజెక్టులన్నీ పూర్తయితే 27,949 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అందుబాటులోకి వస్తుంది.
విద్యుత్తు రంగం బలోపేతానికే కాకుండా ప్రతీ సంవత్సరం గృహ, వ్యవసాయ, కులవృత్తులు, పౌల్ట్రీ తదితర రంగాలకు కేటాయిస్తున్న సబ్సిడీలు మరియు రాయితీలు సుమారు 98 వేల కోట్ల రూపాయలకు పైమాటే.
నిరంతరం విద్యుత్తురంగ రాబోయే సామర్థ్యాన్ని అంచనాలు వేసుకుంటూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నెట్‍వర్క్ను, సబ్‍స్టేషన్లు, లైన్లు ట్రాన్స్ఫార్మర్లును జోడించుకుంటూ వెళ్లడమే కాకుండా కేంద్రం నుండి అవసరమైన సహాయ సహకారాలు లేకపోయినా, కారణాలేమైనా కలిగిస్తున్న అవాంతరాలను దాటుకుని దృఢంగా నిలబడి తెలంగాణ ప్రజల కరెంటు కష్టాలు తీర్చడం కేవలం కేసీఆర్‍కే సాధ్యపడింది.
–శశికళ ఠాకూర్