ఆధునిక జీవశాస్త్ర పరిశోధనల్లోకీలక పాత్ర పోషిస్తున్న సిసిఎంబి

ఈ సృష్టిలో ప్రాణమున్న ప్రతిజీవి ప్రత్యేకమైనదే. అది మనుషులైనా, జంతుజాలమైనా, వృక్షాలైనా… ప్రత్యేక కణజాలం, జీవ అణువల•తో వేటికవే ప్రకృతిలో తమ అస్తిత్వం కోసం పోరాడుతుంటాయి. అలాంటి సందర్భాల్లో వాటికొచ్చే వ్యాధులు, జీవ పక్రియల్లో జరిగే మార్పులు, వాటిని నివారించడానికి చేయాల్సిన కృషి వంటి విషయాలపై… సెంటర్‍ ఫర్‍ సెల్యులర్‍ అండ్‍ మాలిక్యులర్‍ బయాలజీ పనిచేస్తుంది. భారతదేశ ఆధునిక జీవశాస్త్ర రూపశిల్పిగా పేరుగాంచిన పి.ఎమ్‍.భార్గవ ఆధ్వర్యంలో 1977లో హైదరాబాద్‍లో ఏర్పాటైన ఈ సంస్థ ‘కౌన్సిల్‍ ఆఫ్‍ సైంటిఫిక్‍ అండ్‍ ఇండస్ట్రియల్‍ రీసెర్చ్’ నిర్వహణలో పనిచేస్తుంది. దేశంలోనే ఎంతో ప్రత్యేకమైన ఈ సంస్థ మన హైదరాబాద్‍లో ఏర్పాటుకావడం మనకు గర్వకారణం.
యునెస్కోకు చెందిన ‘గ్లోబల్‍ మాలెక్యులర్‍ అండ్‍ సెల్‍ బయాలజీ నెట్‍వర్క్’ విభాగం, సిసిఎమ్‍బిని ‘సెంటర్‍ ఆఫ్‍ ఎక్సలెన్సీ’గా గౌరవిస్తోంది. మనదేశంతోపాటు వివిధ దేశాల పరిశోధనల్లోనూ సిసిఎమ్‍బి తనవంతు పాత్ర నిర్వహిస్తూ ఉంటుంది. అమెరికాలోని ‘నేషనల్‍ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ హెల్త్’, ‘హోవర్డ్ మెడికల్‍ స్కూల్‍ ’, ‘మసాచుసెట్స్ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ టెక్నాలజీ ’ వంటి సంస్థలు సిసిఎమ్‍బితో భాగస్వామై ఉన్నాయి. బ్రిటన్‍కు చెందిన ‘ఇంపీరియల్‍ క్యాన్సర్‍ రీసెర్ట్ సెంటర్‍’ ‘కేమ్‍బ్రిడ్జి యూనివర్సిటీ’ అటు జపాన్‍కు చెందిన ‘ఇండియా-జపాన్‍ సైన్స్ కౌన్సిల్‍’, ‘యూనివర్సిటీ ఆఫ్‍ ర్యుక్యుస్‍ సంస్థలు… ఫ్రాన్స్కు చెందిన ‘సెంటర్‍ నేషనల్‍ డె లె రీసెర్చ్ సైంటిఫిక్‍’, ‘పోశ్చర్‍ ఇన్‍స్టిట్యూట్‍’… జర్మనీకి చెందిన ‘వోక్స్ వోగన్‍’ ఫౌండేషన్‍ సంస్థలు… సిసిఎమ్‍బితో కలిసి సంయుక్తంగా పరిశోధనలు చేస్తుంటాయి.


సిసిఎమ్‍బి పాత్ర –
శక్తి, జలం, పౌష్టికాహారం, ఆరోగ్యం, పారిశుధ్యం, పర్యావరణం … ఈ రంగాల్లో మేలైన మార్పుల దిశగా శాస్త్ర విజ్ఞాన పరిశోధనలను సిసిఎమ్‍బి నిర్వహిస్తుంది.ఆధునిక జీవశాస్త్రంలో ప్రాథమికస్థాయిలో వివిధ విభాగాలను ఏర్పాటుచేసుకుని సిసిఎమ్‍బి పరిశోధనలు జరుగుతుంటాయి. వీటిలో కణాల పనితీరు, వ్యాధుల పరిస్థితి, వాటిని అంటిపెట్టుకుని ఉండే కణాలు, జీవక్రియ, మెదడులోని రుగ్మతులలో జన్యు నియంత్రణ వంటి విషయాలపై సిసిఎమ్‍బి పరిశోధనలు చేస్తుంది. జీవ కణాల్లో ప్రొటీన్ల ప్రభావం, జీవరసాయనాల పనితీరుపై నిరంతరం పరిశోధనలు జరుగుతుంటాయి. సిసిఎమ్‍బి పరిశోధనల్లో మరో ముఖ్యమైనది జెనెటిక్‍ ఎనాలసిస్‍. జన్యుపరంగా వచ్చే వ్యాధులపైన విశ్లేషణలను ఇక్కడి శాస్త్రవేత్తలు చేస్తుంటారు. ఇన్‍ఫెక్షన్లలో లీష్మేనియా, ప్లాస్మోడియం, ఎమ్‍టిబి, హెచ్‍సివి, హెచ్‍ఐవి వంటి వ్యాధులు… అవి మానవ శరీరంలో జరిపే ప్రతిచర్యలపైనా సిసిఎమ్‍బిలో నిరంతరం అన్వేషణ జరుగుతుంది.


సిసిఎమ్‍బి సంస్థ గురించి కొన్ని ముఖ్య విషయాలు-
ఆధునిక జీవశాస్త్ర రంగంలో దేశంలోనే అత్యున్నత పరిశోధనా సంస్థగా సిసిఎమ్‍బి పేరుగాంచింది.
ఆధునిక జీవశాస్త్ర ఆవశ్యకతను గుర్తించిన ‘కౌన్సిల్‍ ఆఫ్‍ సైంటిఫిక్‍ అండ్‍ ఇండస్ట్రియల్‍ రీసెర్చ్-సి.ఎస్‍.ఐ.ఆర్‍ సంస్థ 1976లో సిసిఎమ్‍బి ఏర్పాటుకు అనుమతిచ్చింది. సి.ఎస్‍.ఐ.ఆర్‍ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 44 పరిశోధనా కేంద్రాలు పనిచేస్తుండేవి. ప్రస్తుతం ‘ఇండియన్‍ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ కెమికల్‍ టెక్నాలజీ’ పేరు అప్పట్లో రీజినల్‍ రీసెర్చ్ లేబరేటరీగా ఉండేది. దాని బయోకెమిస్ట్రీ డివిజన్‍గా పాక్షిక స్వయంప్రతిపత్తిగల సంస్థగా సిసిఎమ్‍బి 1977 ఏప్రిల్‍ 1న ఏర్పాటైంది. అప్పటి నుంచి 1990 వరకు పి.ఎమ్‍.భార్గవ డైరెక్టర్‍గా పనిచేశారు. 1981-82 కాలంలో సిసిఎమ్‍బి పూర్తిస్థాయిలో ఎగ్జిక్యూటివ్‍ కమిటీ, సైంటిఫిక్‍ అడ్వైజరీ కౌన్సిల్‍ ఏర్పాటు అయ్యాయి.


సిసిఎమ్‍బి అవార్డులు – గుర్తింపులు

  1. యునెస్కోకు చెందిన గ్లోబల్‍ నెట్‍వర్క్ ఆఫ్‍ మాలిక్యులర్‍ అండ్‍ సెల్‍ బయాలజీ విభాగం సిసిఎమ్‍బిని ‘ సెంటర్‍ ఆఫ్‍ ఎక్సలెన్స్’గా గుర్తించింది.
  2. ‘థర్డ్ వరల్డ్ అకాడమీ ఆఫ్‍ సైన్సెస్‍’ అవార్డుతో ఇటలీ గుర్తించింది.
  3. డిఎన్‍ఎ ఫింగర్‍ ప్రింటింగ్‍లో చేసిన పరిశోధనలకుగాను జీవశాస్త్రంలో సిఎస్‍ఐఆర్‍ టెక్నాలజీ అవార్డు లభించింది.
  4. సైన్స్ అండ్‍ టెక్నాలజీలో అద్భుతమైన ప్రదర్శన చూపించినందుకు సిసిఎమ్‍బికి ఇండియన్‍ ఛాంబర్‍ ఆఫ్‍ కామర్స్ కూడా సిసిఎమ్‍బిని సత్కరించింది.
  5. ఐసిఐసిఐ బ్యాంక్‍ స్థాపించిన ‘ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్’లో సిసిఎమ్‍బికి సభ్యత్వం కూడా ఉంది.
  6. అడ్వాన్సడ్ బయోమెట్రిక్స్లో అంతర్జాతీయ సంస్థగా పేరుగాంచిన ‘ఏపిబయోనెట్‍’ సంస్థలో సిసిఎమ్‍బికి సభ్యత్వం కూడా ఉంది.


సిసిఎమ్‍బి పరిశోధనా విభాగాలు

  1. బయోమెడిసిన్‍ అండ్‍ బయో టెక్నాలజీ
  2. జెనిటిక్స్ అండ్‍ ఎవల్యూషన్‍, జినోమిక్స్
  3. సెల్‍ బయాలజీ అండ్‍ డెవలప్‍మెంట్‍
  4. మొలుక్యులర్‍ బయాలజీ అండ్‍ స్ట్రక్చరల్‍ బయాలజీ
  5. బయో కెమిస్ట్రీ అండ్‍ బయో ఫిజిక్స్
  6. ఇన్‍ఫెక్సియస్‍ డిసీజెస్‍
  7. కంప్యూటేషనల్‍ బయాలజీ అండ్‍ బయోఇన్‍ఫార్మటిక్స్


సిసిఎమ్‍బి తాజా పరిశోధనల్లో వెల్లడైన విషయం-
మేనరికం వివాహాలతో జన్యుపరమైన వ్యాధులు సంక్రమిస్తాయని అందరికీ తెలసిన విషయమే. దీనికి సంబంధించి అనేక తాజా విషయాలు సిసిఎమ్‍బి పరిశోధనల్లో వెల్లడయ్యాయి. మేనరికాలతోపాటు ఒకే సామాజిక వర్గంలో స్వగోత్రికుల్లో వివాహాలవల్ల వంశానుగత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని సిసిఎమ్‍బి డైరెక్టర్‍ డాక్టర్‍ రాకేశ్‍ మిశ్రా తెలిపారు. సిసిఎమ్‍బి అంచనాల ప్రకారం దక్షిణాసియాలో దాదాపు 5 వేల జన్యు సమూహాలున్నాయి. దీనివల్ల ఈ ప్రాంత ప్రజల్లో కొన్ని ప్రత్యేకమైన వ్యాధులు వస్తుంటాయి. వీటిలో ఇప్పటి వరకు కొన్ని మాత్రమే కనుక్కోగలిగారు. ఒక సామాజిక వర్గంలో వచ్చే వ్యాధులకు ‘బ్యూట్రైఎల్‍క్లోనిస్టిరేజ్‍’ అనే ఎంజైమ్‍ తక్కువగా ఉండ•మే కారణమని పరిశోధనల్లో తేలింది.
పరిశోధనా ఫలాలను వేగంగా సామాన్యులకు అందించేందుకు సిసిఎమ్‍బి వినూత్న ఆలోచనలతో ముందుకెళుతోంది. చిన్న, మధ్యతరహా కంపెనీల ఆలోచనలను వాణిజ్యస్థాయికి చేర్చేందుకు సహాయపడుతోంది. దీంతో సొంతంగా పరిశోధనలు నిర్వహించలేని సంస్థలకు సిసిఎమ్‍బి తనవంతు సహాయం చేస్తుంది.


సిసిఎమ్‍బి సాధించిన విజయాలు-

  1. మనదేశంలో అత్యధికులు ఎదుర్కొంటున్న సమస్యలు గుండె సంబంధిత సమస్యలు. వీటి కారకాలపై సిసిఎమ్‍బి చేసిన పరిశోధనలు సత్ఫలితాలనిచ్చాయి.
  2. ఎలుకలపై జన్యుపరంగా సరిచేసిన ప్రయోగాల్లో సిసిఎమ్‍బి ప్రత్యేమైనది.
  3. దేశంలో క్యాన్సర్‍ నివారణకు ఉపయోగిస్తున్న మందులపై కూడా ఓ ప్రత్యేకమైన పరిశీలన వ్యవస్థను సిసిఎమ్‍బి ఏర్పాటు చేసింది.
  4. ప్రత్యేకమైన డిఎన్‍ఎ ఫింగర్‍ ప్రింటింగ్‍ టెక్నాలజీ ద్వారా అండమాన్‍ దీవుల్లో ఓ ప్రత్యేకమైన తెగను, వారి జీవ, అణువంశిక విషయాలను సిసిఎమ్‍బి తెలుసుకుంది.
  5. కంటి అంటు వ్యాధులకు కారణమవుతున్న వ్యాధులను డిఎన్‍ఎ పరిశోధనాల ద్వారా తెలుసుకుని, వాటిని నిర్మూలించడంలో సిసిఎమ్‍బి విజయం సాధించింది.
  6. అన్ని రకాల వ్యాధులు తట్టుకునే విధంగా వరివంగడాలను సిసిఎమ్‍బి సృష్టించింది.
  7. ఇండస్ట్రియల్‍ బయో టెక్నాలజీ రంగంలో ఎంజైమ్‍లు, బయో మాలుక్యుల్స్లో నేటివ్‍ బ్యాక్టీరియాను సిసిఎమ్‍బి పరిశోధనలు జరిగాయి.

పై వాటితోపాటు డిఎన్‍ఎ, సిపిఎ వంటి అనేక ప్రత్యేక విభాగాల్లో సిసిఎమ్‍బి పరిశోధనలు సత్ఫలితాలను ఇచ్చాయి.


ఆధునిక జీవ శాస్త్ర రూపశిల్పి ‘పిఎమ్‍ భార్గవ’
సీసీఎమ్‍బి గురించి ప్రస్తావన వచ్చిన ప్రతీసారి గుర్తుకుతెచ్చుకోవాల్సిన అతిముఖ్యమైన వ్యక్తి (పుష్ప మిత్ర భార్గవ) పి.ఎమ్‍.భార్గవ. ఆధునిక జీవశాస్త్ర రూపశిల్పిగా పేరుగాంచిన భార్గవ ఫిబ్రవరి 22, 1928న రాజస్థాన్‍లోని అజ్మీర్‍లో జన్మించారు. ఆయన తండ్రి రామచంద్ర భార్గవ, తల్లి గాయత్రీ భార్గవ. వారణాసిలోని బీసెంట్‍ థియోపాసికల్‍ స్కూల్‍లో భార్గవ విద్యాభ్యాసం సాగింది. 1946లో లక్నో విశ్వవిద్యాలయం నుంచి ఆర్గానికి కెమెస్ట్రీలో ఎమ్మెస్సీ పట్టా పొందారు. 21వ ఏటనే సింథటిక్‍ ఆర్గానిక్‍ కెమిస్ట్రీపై పరిశోధన చేశారు. 23 ఏళ్ల వయసులోనే 14 అంశాలపై పరిశోధనా పత్రాలను ప్రచురించారు. 1950 నుంచి 1953 వరకు ఇండియన్‍ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ కెమికల్‍ టెక్నాలజీలో, అదే సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ కెమెస్ట్రీ విభాగంలో లెక్చరర్‍గానూ పనిచేశారు. 1953 నుంచి 1956 వరకు అమెరికాలోని విస్కాన్సన్‍ యూనివర్సిటీలో విధులు నిర్వహించారు. అక్కడే హెడిల్‍ బర్గర్‍ లేబరేటరీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా నిలిచి యాంటీ డ్రగ్‍ ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించారు.
పద్మభూషణ్‍ సహా 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆయన్ను వరించాయి. 2015 సంవత్సరంలో అప్పటి పరిస్థితుల కారణంగా పద్మభూషణ్‍ అవార్డును ఆయన ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. సైంటిస్ట్గానే కాకుండా సామాన్య జనం కోసం మూఢనమ్మకాల నిర్మూలనకు ఆయన ఎంతగానో కృషి చేశారు. •నేషనల్‍ నాలెడ్జ్ కమిషన్‍ వైస్‍ చైర్మన్‍గా పనిచేసిన భార్గవ, ప్రభుత్వానికి పలు విలువైన సూచనలు చేశారు.
ఎన్డీయే ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్య శాస్త్రాన్ని కోర్సుగా ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నప్పుడు నిర్ద్వందంగా వ్యతిరేకించి సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. హైదరాబాద్‍లో బత్తిన సోదరులు పంపిణీ చేసే చేప మందు శాస్త్రీయతను సవాల్‍ చేస్తూ 2008 నుంచి జనవిజ్ఞాన వేదిక చేపట్టిన అన్ని ఆందోళన కార్యక్రమాల్లోనూ భార్గవ పాల్గొన్నారు. చివరికి హైకోర్టు వరకు వెళ్లారు. చివరికి దాన్ని చేపమందుగా పరిగణించరాదని, చేప ప్రసాదంగానే భావించాలని హైకోర్టు పేర్కోంది.


పి.ఎమ్‍. భార్గవ రచించిన పుస్తకాలు-

  1. ప్రొటీన్స్ ఆఫ్‍ సెమినల్‍ ప్లాస్మా
  2. ద సాగా ఆఫ్‍ ఇండియన్‍ సైన్స్ సిన్స్ ఇండిపెండెన్స్ – ఇన్‍ ఎ నట్‍షెల్‍
  3. ఏంజిల్స్, డెవిల్‍ అండ్‍ సైన్స్ – ఎ కలెక్షన్‍ ఆర్టికల్స్ ఆఫ్‍ సైంటిఫిక్‍ టెంపర్‍
  4. ఎజెండా ఫర్‍ ద నేషన్‍ – ఏన్‍ అన్‍టోల్డ్ స్టోరీ ఆఫ్‍ ద యు.పి.ఎ. గవర్నమెంట్‍


మల్టీనేషనల్‍ విత్తనాల కంపెనీల వ్యవహారంలోనూ పి.ఎమ్‍.భార్గవ తీవ్రంగా వ్యతిరేకించేవారు. జన్యుమార్పిడి వంగడాలపై దీర్ఘకాలంపాటు పరిశోధనలు జరిగాక మాత్రమే వాటికి అనుమతులివ్వాలని భార్గవ అభిప్రాయపడేవారు. 2013 ఏర్పాటైన ‘రిప్రొడక్టివ్‍ టెక్నాలజీస్‍’ డ్రాఫ్టింగ్‍ కమిటీకి భార్గవ ఛైర్మన్‍గానూ వ్యవహరించారు. 2016లో సరోగసీపై కేంద్రం విధించిన ఆంక్షలను కూడా భార్గవ వ్యతిరేకించడంతోపాటు సరోగేట్‍ మదర్స్ హక్కులకు రక్షణ కల్పించాలని కూడా నినదించారు. అలా… జీవ శాస్త్ర రంగంలో విశేష సేవలందించిన భార్గవ ఆగస్టు 1, 2017న హైదరాబాద్‍లో తీవ్ర అనారోగ్యంతో మరణించారు.

పి.ఎమ్‍.భార్గవ వంటి ఆధునిక జీవ శాస్త్ర వేత్తల కృషితో ఎన్నో విజయాలు సాధించిన సిసిఎమ్‍బి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.


-ఎం.డి.కరీం,
ఎ: 9618644771

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *