అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-16 కాకతీయ హరిహరుని ఇటికాల శాసనం (క్రీ.శ.1148)


కాకతీయ వంశానికి మూలపురుషుడు వెన్నడు. తరువాత ముగ్గురు గుండనలు, ఎఱ్ఱయ, పిండి (నాలుగో) గుండన, గరుడ బేత, మొదటి ప్రోలుడు, త్రిభువనమల్లుడు, రెండోప్రోలుడు, రుద్రుడు, మహదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రులు వరుసగా కాకతీయ రాజ్య, సామ్రాజ్యాలను సామంతులుగా, స్వతంత్రులుగా, క్రీ.శ. 8వ వతాబ్దినుంచి క్రీ.శ. 1323 వరకూ తెలంగాణాతో కలిసి ఉన్న తెలుగు నేలను పాలించారు. శాసనాధారాలతో కాకతీయుల వంశక్రమాన్ని ప్రామాణికంగా మనకందించిన వారు పి.వీ.పరబ్రహ్మ శాస్త్రిగారు. వివరాలకు పి.వీ.పరబ్రహ్మవాస్త్రి, కాకతీయులు, ఎమెస్కో, హైదరాబాదు, రెండో ముద్రణ, 2016, పే.41 చూడొచ్చు. వీరిలో రెండోప్రోలుడు క్రీ.శ. 1116 నుంచి క్రీ.శ. 1157 వరకు పాలించగా, ఆయన తరువాత రుద్రుడు క్రీ.శ. 1158-1195 వరకూ పాలించారు. రుద్రుడు ప్రోలుని కుమారుడు. రుద్రునితో పాటు ప్రోలుని కొడుకుల్లో మహదేవుడు, గణపతి ప్రముఖులని కాకతీయ మైలాంబ బయ్యారం శాసనం పేర్కొంటుంది. ఆమె వేయించిన త్రిపురాంతకం శాసనంలో రుద్రదేవుడు, మహాదేవులకు హరిహర, గణపతి మొదలైన సోదరులున్నారని, (తాసి ఆధాద్వావభూతం హరిహర గణపతి ఆవిర్భాతృమంతా! పుత్రారుద్రాభిధాన క్షితిపతి తిలక శ్రీమహదేవభూపాలన) చెప్పింది. ఈ విషయాన్ని పీవీ పరబ్రహ్మ శాస్త్రిగారు కాకతీయ వంశ, కాలానుక్రమణికల్లో (కాకతీయులు, ఎమెస్కో, 2016, పే.42). రుద్రుడు, మహదేవుల తరువాత హరిహరుడు, గణపతి, రేపొల్ల దుర్గభూపతులను పేర్కొన్నాడు. ఆంధ్రుల చరిత్ర, (విశాలాంధ్ర 2014, పే.202) రాసిన బిఎస్‍ఎల్‍ హనుమంతరావుగారు, ‘కాకతీయ యుగం’ (పే.188-227) అన్న అధ్యాయంలో రెండోప్రోలుని కుమారుల్లో హరిహరుడున్నట్లు పేర్కొనలేదుగానీ, హరిహర, మురారి దేవులను, రుద్రమ సవతి కుమారులనీ, వారు రుద్రమ సవతి కుమారులనీ, వారు రుద్రమ దేవిపై చేసిన తిరుగుబాటును, ఆమె అణచి వేసిందని ప్రతాపరుద్ర చరిత్ర ఆధారంగా రాశారు. (పే.202). ఆంధప్రదేశ్‍ సమగ్ర చరిత్రను రాసిన పి.వి.కె. ప్రసాదరావు, ‘కాకతీయుగం’ అధ్యాయంలో, రుద్రమదేవి తనపై తిరుగుబాటు చేసిన హరిహర, మురారిదేవులను ఓడించి, మరణ శిక్ష విధించిందని ప్రతాపరుద్రచరిత్రలో ఉందని రాశారు. ప్రతాపరుద్రచరిత్ర ఆధారంగా పై ఇద్దరు రచయితలూ, హరిహరుడు, రుద్రుమదేవి సవతి తమ్ములుగా పేర్కొనటం గమనార్హం. పరబ్రహ్మశాస్త్రిగారు, శాసనాధారాలతో హరిహరుడు, కాకతీయ రెండో ప్రోలుని కుమారుడనే చెప్పారు.


రెండో ప్రోలరాజు కుమారుడైన హరిహరుడు, రుద్రమదేవి సవతి తమ్ముడైన హరిహరదేవుల గురించి పైన పేర్కొన్న నేపథ్యంలో కాకతీయ గుండరాజు కుమారుడైన మరో హరిహరదేవరాజు (మహామండలేశ్వర కాకతీయ గుండ్రాజు హరిహరదేవరాజు) మునుపటి మెదక్‍ జిల్లా, గజ్వేల్‍ మండలం, ఇటికాలలోని క్రీ.శ. 1148 నాటి శాసనంలో ప్రత్యక్షమైనాడు. ఇట్టికాల సోమనాథ దేవర దేవాలయం వద్ద గంపలు మోయగా వచ్చిన ఆదాయంలో గంపకు కొంత చొప్పున, అఖండ దీపానికి దానం చేసిన సందర్భంగా హరిహర రాజు ప్రస్తావన ఉంది. అదే సమయంలో కాకతీయ రుద్రదేవుడు అనుమకొండ నుంచి పాలిస్తున్నాడు. అలాంటప్పుడు, ఈ హరిహరదేవుడు, రుద్రదేవున్ని గాని, అతనితో గల సంబందాన్ని గానీ పేర్కొనకుండా విడుదల చేసిన ఈ శాసనంపైన, హరిహరునిపైన చర్చ జరగాలి.


శాసన పాఠం :
మొదటి వైపు

  1. స్వస్తి సమధి గద (త)
  2. పంచ మహా శబ్ద
  3. మహా మండలేశ్వ
  4. ర పరమ మాహేశ్వ
  5. ర అనుమకోండాది నా
  6. నా దేశాధీశ్వర చలమత్తి
  7. య గండ సతమ వి
  8. జయ య (మ)ం నియ వె
  9. oట కాఱ నామాది స
  10. మస్త ప్రశస్త్యిం సహితం
  11. స్వస్తి శ్రీమను మహా
  12. మండ లేశ్వర కాకెతీ
  13. య్య గుండ్రాజ హరిహ
  14. ర దేవరాజును ఇట్టె
  15. కాల శ్రీసోమనాథ
  16. బ్రాహ్మల ముద్రాపణ
  17. పైండి దీపాన కిస్తిమి
    రెండోవ వైపు
  18. దేవరకు
  19. విభవ స
  20. oవత్స ర కా
  21. త్తి క బహూ
  22. ళ పంచదసి
  23. గురు వారాన శ
  24. కవరుషాలు
    మూడో వైపు
  25. 1070 అగునేంటి సూ
  26. య్య గ్రహణ కాల
  27. ము నందు ఇట్టుకా
  28. ల నఖరము ఎంద
  29. ఱు గలిగినాను తల
  30. మోచి అంమి గంపల
  31. సుఖ ముండుము నా
  32. యమును అఖండదీపా
  33. లకు ఇచ్చిన వారము


ఇక శాసనంలోని పదాలను పరిశీలిద్దాం. ‘పంచ మహాశబ్ద, మహాండలేశ్వర, పరమ మాహేశ్వర అనుమకోండాది నానాదేశా ధీశ్వర చలమర్తిగండ సతమ విజయ నియమ వెంటకాఱ నామాది’ మండలేశ్వర కాకతీయ్య గుండ్రాజ హరిహరదేవరాజు’ అని శాసనం ప్రారంభమైంది. మహామండలేశ్వర కాకతీయ్య గుండ్రాజ హరిహర దేవరాజు చర్చనీయాంశం. కాకతీయ వంశస్థాపకుడైన వెన్నని కుమారుడు మొదటి గుండన, అతని కొడుకు రెండో గుండన, అతని కొడుకు మూడో గుండన (క్రీ.శ. 900), అతని మనుమడు నాలుగో గుండన (క్రీ.శ.955-995), ఇక ఆ తరువాత కాకతీయ వంశ వృక్షంలో మరో గుండన / గుండయ కనిపించడు. ఇట్టికాల, ఇట్టుకాల (ఇటికాల), నఖరము (నకరము = దేవాలయము, మార్కెటు) తలమోచి (తలపై పెట్టుకొని మోచిన), అంమి (అమ్మి), పంచదసి (పంచాదశి) పదాలు గమనించదగ్గవి.


మరి ఇటికాల శాసనంలోని కాకతీయ్య గుండ్రాజు ఎవరు? గుండ్రాజ హరిహరుడు గుండరాజు కొడుకా, లేక రెండో ప్రోలుని కుమారుడు రుద్రదేవుని సోదరుడైన హరిహరుడా? శాసన తేదీ 1148, అప్పటికి రెండో ప్రోలుడు బతికుండి, పాలన సాగిస్తున్నట్లు అతనిదే అయిన క్రీ.శ. 1149 నాటి శనిగరం శాసనం వల్ల తెలుస్తుంది. రెండో ప్రోలరాజు పాలిస్తుండగా అనుమకొండాది నానాదేశాధీశ్వరుడై, మహామండలేశ్వరుడుగా పేర్కొన్న, కాకతీయ గుండ్రాజ హరిహర రాజెలా స్వతంత్రునిగా, ఇటికాల శాసనాన్ని వేయించాడు, శాసన తేదీ తప్పై ఉంటుందన్న మైలమాంబ త్రిపురాంతక శాసనంలోని, రెండోప్రోలుని కొడుకు మరికొందరిలో ఒకడైన హరిహరునిగా గుర్తించవచ్చని చెప్పిన పివి పరబ్రహ్మశాస్త్రిగారు కూడా ఇటికాల శాసనంలోని హరిహరుడెవరో ఖచ్చితంగా తేల్చలేదు. కాబట్టి, ఇటికాల శాసనంలోని కాకతీయ గుండ్రాజు, హరిహరులపై మరికొంత చర్చ జరగాలి. (ఈ విషయంగా నాతో సుదీర్ఘ ఫోను సంభాషణ జరిపిన శ్రీరామోజు హరగోపాల్‍గారికి నా కృతజ్ఞతలు).


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *