తల్లీ, బిడ్డ ఆరోగ్యం, శిశు పోషణ, కుటుంబం మరియు పిల్లల ఆరోగ్యం, విద్యార్థులకు మంచి విద్యను అందించడం అనే ఉన్నత ఆశయాలతో ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్. దీని విస్తృత నామంఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి.
ఆవిర్భావం:
1946 డిసెంబర్ 11వ తేదీన ఏర్పడింది. రెండవ పప్రంచ యుద్ధం ఎందరో సైనికులను, మరెందరో అమాయకులైన ప్రజలను బలిగొంది. అందువల్ల చాలామంది పిల్లలు అనాధలయ్యారు. వీరిని పెంచి పోషించే బాధ్యత కోసం యూనిసెఫ్ ఏర్పడింది. పోలెండ్ దేశస్థుడైన డాక్టర్ లుద్ విక్ రాచ్స్ మన్ ఈ సంస్థ ఏర్పాటుకు కృషిచేశారు.
స్వతంత్ర సంస్థగా ఏర్పడిన యూనిసెఫ్ 1953 సంవత్సరం లో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థగా మారడానికి తన పేరులోని అంతర్జాతీయ, అత్యవసర అనే పదాలను తొలగించింది. కానీ ఇప్పటికీ దాని సంక్షిప్త పదాల్లో మాత్రం యూనిసెఫ్ గానే పిలవబడుతోంది.
యూనిసెఫ్‍లో ప్రస్థుతం192 సభ్యదేశాలున్నాయు. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. ఏడు ప్రాంతీయ కార్యాలయా లున్నాయు. దక్షిణాసియాకు చెందిన ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. ప్రస్తుతం అమెరికన్ మహిళ అయిన హెనెరిట్టా ఫోరెయూనిసెఫ్ డైరెక్టర్ జనరల్‍గా వ్యవహిరిస్తున్నారు.
యూనిసెఫ్ యొక్క ముఖ్య సరఫరా కేంద్రం డెన్మార్క్ దేశంలోని కోపెన్ హేగెన్‍లో ఉంది. ఇక్కడి నుంచివివిధ దేశాలకు టీకాలను, ఎయిడ్స్కు మందులను శిశు పోషణకు సంబంధించిన పదార్థాలను ఎగుమతి చేస్తుంది.
యూనిసెఫ్ వ్యూహం: పిల్లలమనుగడ మరియు అభివృద్ధి కోసం యూనిసెఫ్ GOBI – FFF అనే వ్యూహన్ని అనుసరిస్తోంది. G-గ్రోత్ మానిటరింగ్ అంటే పిల్లల పెరుగుదలను అంచనా వేయుట. O-ఓరల్ రీ హైడ్రేషన్ అంటే అతిసారం వల్ల కలిగే డీ హైడ్రేషన్ తొలగించే పద్దతి. B- బ్రెస్ట్ ఫీడింగ్ అంటే కనీసం పిల్లలకు ఆరు నెలలు తల్లిపాలు ఇప్పించడం. I- ఇమ్యునైజేషన్‍అంటే అమ్మవారు, పోలియో వంటి వ్యాధులకు వ్యాక్సిన్ ఇప్పించడం. F-ఫిమేల్ ఎడ్యుకేషన్ అంటే మహిళలకు విద్యను అందించడం. F-ఫ్యామిలి స్పేసింగ్ అంటే ఒక ప్రసవానికి మరొక ప్రసవానికి కనీసం 18 నెలలు గడువు ఉండటం. F-ఫుడ్ సప్లిమెంటేషన్ అంటే శరీర పోషకాలైన ఖనిజాలు మరియు విటమిన్లు మాత్రల రూపంలో అందించటం.
నిధుల సేకరణ : సభ్య దేశాల నుండి గ్రాంట్ రూపంలోను, స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాల రూపంలో నిధులను సేకరిస్తుంది. దీనితో పాటు ‘ట్రిక్ అండ్ ట్రీట్’ అనే కార్యక్రమం ద్వారా నిధులను సేకరిస్తుంది. దీనిని మొదటి సారి 1950 సంవత్సరంలో అమెరికాలోని పెన్సిల్వేనియాలో మేరి ఎమ్మా అల్లిసన్ అనే మహిళ నారింజ రంగు వేసిన పాల డబ్బాలను పిల్లలకు ఇచ్చి యూనిసెఫ్‍కు నిధులకు సేకరించింది.
అంబాసిడర్‍లు : ప్రముఖ వ్యక్తులను యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్‍లు గా నియమిస్తుంది. 1954 సంవత్సరంలో మొదటి అంబాసిడర్‍గా ప్రముఖ అమెరికన్ నటుడు డానీ కే ఎంపికయ్యారు. 2021 సంవత్సరంలో లిల్లిసింగ్ అనే కెనడా మహిళ అంబాసిడర్‍గా ఎంపికయ్యారు. భారతదేశం నుంచి అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా వంటి వారు యూనిసెఫ్ గుడ్‍విల్ అంబాసిడర్‍లుగా ఎంపికయ్యారు.
అవార్డులు: యూనిసెఫ్ చేస్తున్న కృషికి 1965 సంవత్సరంలో నోబుల్ శాంతి బహుమతి పొందింది. 1989 సంవత్సరంలో భారతదేశ ప్రభుత్వం ఇందిరాగాంధిశాంతి పురష్కారాన్ని అందించింది. 2006 సంవత్సరంలో ప్రిన్సిస్ ఆఫ్ ఆస్ట్రియాస్ అవార్డును సొంతం చేసుకొంది.
భారతదేశంలో యూనిసెఫ్ ఆవశ్యకత:
భారతదేశంలో 38.4% మంది పిల్లలకు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు.నూటికి నూరు శాతం టీకాలు అందటం లేదు.శిశుమరణాల రేటు బాలురకంటే బాలికల్లో ఎక్కువగా ఉంది. పట్టణ మురికివాడల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, షెడ్యూల్ తెగలు మరియు కుటుంబాలలో పోషకాహార లోపంతో పిల్లలు బాధపడుతున్నారు. బాల్యవివాహాలు జరుగుతున్నాయి. పాఠశాల హాజరు శాతం తక్కువగా ఉంటోంది. అమ్మాయిలు లైంగిక వేధింపులపాలవుతున్నారు. మహిళలుగృహ హింసకుగురౌతున్నారు.
భారతదేశంలో యూనిసెఫ్ కార్యక్రమాలు:
గత కొన్ని దశాబ్దాలుగా యూనిసెఫ్ చేస్తున్న కార్యక్రమాల ద్వారా భారతదేశంలో శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గింది. 80శాతానికి పైగా మహిళలు మంచి ఆరోగ్య పరిస్థితులలో ప్రసవిస్తున్నారు. బడి బయట ఉన్న విద్యార్థుల సంఖ్య కూడా తగ్గి రెండు మిలియన్ల లోపుకు వచ్చింది. జనాభా పరంగా రెండవ అతిపెద్ద దేశం మనది. ప్రపంచ జనాభాలో దాదాపు 18శాతం వంతును కలిగి ఉంది. ఇంతటి జనాభా కలిగిన దేశంలో యూనిసెఫ్ చేసిన కార్యక్రమాలు ప్రధాన విజయాలే అవుతాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కోవిడ్ -19 మహమ్మారి నుండి బయట పడటానికి యూనిసెఫ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు సరియైన సమాచారాన్ని అందిస్తున్నాయి. మన వంతు క•షిగా మరొకరికి చదువు చెప్పటం లేదా కనీసం చదువు ప్రాధాన్యతను తెలియజేయటం చేయాలి. ఆవిద్య ద్వారానే వారిని చైతన్యవంతుల్ని చేద్దాం.
- కె.హరి మదుసూధన రావు,
ఎ : 9440521458